HomeTelanganaతెలంగాణలో ప్రాదేశిక పోరుకు రంగం సిద్దం...!

తెలంగాణలో ప్రాదేశిక పోరుకు రంగం సిద్దం…!

  • కసరత్తు ప్రారంభించిన ఈసీ

  • ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం

  • ఆశావహుల్లో కదలిక ప్రారంభం

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. స్థానిక ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు కసరత్తు ప్రారంభం అయింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మేలో ప్రాదేశిక ఎన్నికలు ఖాయమని తెలుస్తోంది. దీంతో మరోసారి తెలంగాణలో పల్లెలు పొలిటికల్ గా వేడెక్కనున్నాయి. రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది.

గత సెప్టెంబర్ లోనే నోటిఫికేషన్…

వాస్తవానికి గత సెప్టెంబర్ లోనే ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. అయితే బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ విచారణ కారణంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అటు తరువాత కోర్టు అనుమతితోనే పంచాయితీలతో పాటు మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా రిజర్వేషన్ల విధానం ప్రకటించిన అనంతరం హైకోర్టు అనుమతితో మే నెలలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

అప్పుడే పదవుల కోసం పాకులాట…

జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల కోసం అప్పుడే కాంగ్రెస్ పార్టీలో నేతలు పావులు కదపడం ప్రారంభించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించనుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గులాబీ పార్టీకి పట్టు ఉంది. అయితే క్షేత్రస్థాయిలో నాయకత్వం బలహీనంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా జిల్లా పరిషత్ స్థానాలన్నింటినీ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. అయితే ఈసారి బిజెపి సైతం బరిలో ఉండనుంది.

కానీ ఆ పార్టీకి నగరాలు పట్టణాల్లో మాత్రమే పట్టు ఉంది. అయినా సరే వీలైనంత గౌరవప్రదమైన జడ్పిటిసి స్థానాలతో పాటు మండలాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది బిజెపి. అయితే కొన్ని ప్రాంతాల్లో అప్పుడే గులాబీ పార్టీతో బిజెపి చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే ప్రాదేశిక ఎన్నికల్లో హారాహోరీ పోరు తప్పదని తేలుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments