HomeUncategorizedTrain Travel: ఇక స్మూత్ రైలు ప్రయాణం, డగ్…డగ్… సౌండ్ ఉండదట!

Train Travel: ఇక స్మూత్ రైలు ప్రయాణం, డగ్…డగ్… సౌండ్ ఉండదట!

Smart Railways: రైలు ప్రయాణంలో తరచూ వినిపించే “డగ్…డగ్…” శబ్దాలు, ముఖ్యంగా బ్రిడ్జిలు లేదా క్రాసింగ్‌ల దగ్గర, చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తాయి. ఈ సమస్యను తగ్గించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ట్రాక్‌ల కింద ఉపయోగిస్తున్న కాంక్రీటు, ఇనుప దిమ్మెల స్థానంలో ఫైబర్‌తో తయారైన కాంపోజిట్ స్లీపర్లను వినియోగించాలని నిర్ణయించారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చించి, మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త స్లీపర్లు తక్కువ బరువుతో పాటు ఎక్కువ బలం కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల రైళ్ల ప్రయాణంలో వచ్చే కుదుపులు తగ్గిపోతాయి. అదే సమయంలో ట్రాక్‌ల మీదుగా వెళ్లేటప్పుడు వినిపించే శబ్దం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే, ఈ స్లీపర్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. అవసరమైనప్పుడు మరమ్మతులు త్వరగా పూర్తి చేయవచ్చు. దీని వల్ల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. అందుకే మొదటగా వంతెనలు, రైల్వే క్రాసింగ్‌ల వద్ద వీటిని అమలు చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తరువాత అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఇటీవల ట్రాక్‌లపై రాళ్లు పెట్టడం వంటి ప్రమాదకర ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ AI సిస్టమ్‌ను రైలు ముందు భాగంలో అమర్చుతారు. ఇది ముందున్న ట్రాక్‌ను నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది. ట్రాక్‌లపై ఏవైనా అడ్డంకులు, రాళ్లు లేదా ఇతర వస్తువులు ఉన్నా, లేదా పట్టాలు సరిగా లేనప్పుడు ఈ వ్యవస్థ ముందుగానే గుర్తించి హెచ్చరికలు ఇస్తుంది. దీంతో డ్రైవర్‌కు ముందస్తుగా సమాచారం అందడంతో ప్రమాదాలను నివారించడం సులభమవుతుంది.

ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రైలు ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెడుతోంది. భవిష్యత్తులో ఇవి రైలు ప్రయాణాన్ని మరింత మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments