Homeఆంధ్ర ప్రదేశ్Pawan Kalyan: తమిళనాడులో పవన్ పైనే భారం.. ఎన్డీఏకు మద్దతుగా జనసేనాని ప్రచారం!

Pawan Kalyan: తమిళనాడులో పవన్ పైనే భారం.. ఎన్డీఏకు మద్దతుగా జనసేనాని ప్రచారం!

* తెలుగు మాట్లాడే నియోజకవర్గాలే టార్గెట్

* సనాతన ధర్మ నినాదంతో ముందడుగు

క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్: తమిళనాడులో బలపడాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. దశాబ్దాలుగా ఆ ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వస్తోంది. అందుకే ఈసారి అన్నా డిఎంకె కూటమితో బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో ఓట్లతో పాటు సీట్లు పెంచుకోవాలని చూస్తోంది. ఆ బాధ్యతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పెట్టింది. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. ముందుగా నాగర్ కోయిల్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు పవన్.

తమిళనాడు ఓటర్లలో మార్పు

తమిళనాడు రాజకీయాలని ద్రవిడ సిద్ధాంతం చుట్టూ తిరుగుతుంటాయి. అయితే బిజెపి హిందుత్వ అజెండాతో ముందుకు సాగుతోంది. క్రమేపి తమిళనాడు ఓటర్లలో కూడా మార్పు వస్తోంది. సరిగ్గా ఇదే సమయానికి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదాలు అందుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబిగించారు. అందుకు వేదికగా తమిళనాడును ఎంచుకున్నారు. అయితే ఇదంతా బిజెపి ఎన్నికల వ్యూహంలో భాగమేనని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దిగడం చూస్తుంటే మాత్రం పక్కా వ్యూహం అని తెలుస్తోంది. కేంద్ర పెద్దల విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.

నాగర్ కోయిల్ లో పర్యటన..

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ లో తెలుగు ప్రజలు అధికం. అందుకే అక్కడ పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతుగా ప్రచారం చేశారు. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎమ్మార్ గాంధీ బరిలో దిగుతున్నారు. స్థానికంగా పట్టున్న నేత. అందుకే అక్కడ పర్యటిస్తున్నారు పవన్. ఆయన పర్యటన కోసం నాగర్ కోయిల్లో భారీ ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సనాతన ధర్మం, అభివృద్ధి, పొరుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సామరస్యం గురించి ప్రస్తావించారు. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

డీఎంకే విముక్త తమిళనాడుకు..

తమిళనాడులో తెలుగు మాట్లాడే ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలను పవన్ టార్గెట్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపడం ద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. అయితే పవన్ కేవలం నాగర్ కోయిల్ లో మాత్రమే కాదు హోసూరు, చెన్నై పరిసరాల్లోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయించాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఏపీలో కూటమి విజయం సాధించడంలో పవన్ పోషించిన పాత్రను తమిళనాడులో కూడా ఉదహరిస్తున్నారు. అక్కడ డిఎంకె విముక్త ప్రభుత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం సాగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బలమైన హిందుత్వ అభివృద్ధి కోరుకునే నేతగా పవన్ కళ్యాణ్ను ప్రోత్సహించనుంది బిజెపి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments